Breaking News

సీసీఐ పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలి: టీఆర్పీ డిమాండ్

నాయిబ్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

ప్రజా ఎన్ కౌంటర్ ప్రతినిధి, నెన్నెల (మంచిర్యాల జిల్లా):మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో అధిక వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాంటెంకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం నెన్నెల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నాయిబ్ తహసీల్దార్ ప్రకాష్‌కు టీఆర్పీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రాంటెంకి మాట్లాడుతూ, ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, ఇప్పటికే నష్టాల్లో ఉన్న రైతులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.అదేవిధంగా, దిగుబడి తగ్గడం, కూలీల కొరత వంటి కారణాలతో పత్తి ఏరడం ఆలస్యమైందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సీసీఐ కొనుగోలు గడువు ఈ నెల 20వ తేదీతో ముగియడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకవేళ సీసీఐ కొనుగోలు కేంద్రాలను మూసివేస్తే రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుందని, దీని వల్ల క్వింటాల్‌కు సుమారు రూ.2,000 వరకు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి సీసీఐ పత్తి కొనుగోలు గడువును పొడిగించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ మండల అధ్యక్షులు తాళ్ల మహేష్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు సాయి గౌడ్, మారయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *