కరీంనగర్ ప్రజా ఎన్ కౌంటర్ జూన్ 08:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి లో జులై 5న నిర్వహించనున్న ‘సమరభేరి’ మహా బహిరంగ సభను విజయవంతం చేయడం లక్ష్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం కీలక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ మాట్లాడుతూ, జులై 5న జరిగే సమరభేరి సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి, సభ విజయవంతం కోసం విస్తృత స్థాయిలో జన సమీకరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని, యువత సైతం ఉద్యమ స్ఫూర్తితో పాల్గొని సభను చారిత్రాత్మకంగా మార్చాలని కోరారు. అదేవిధంగా ప్రతి మండలంలో గ్రామ కమిటీలను పూర్తి చేసి, ప్రతి గ్రామానికి వెళ్లి జరగబోయే సమరభేరి సభ యొక్క లక్ష్యాలు, ఉద్యమ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని, జులై 5 సమరభేరి సభ పార్టీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచేలా అందరూ కృషి చేయాలని ఆమె కోరారు.
అనంతరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా మాట్లాడుతూ , జులై 5న జరగనున్న సమరభేరిని విజయవంతం చేయడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. బీసీల ఐక్యత, ఆత్మగౌరవం మరియు హక్కుల సాధన కోసం నిర్వహిస్తున్న ఈ సభలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాల్గొని, “బీసీలమంటే ఏంటో నిరూపించుకునే సమయం వచ్చిందని” పేర్కొన్నారు. గ్రామాలు, మండలాలు, పట్టణాల స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి భారీ స్థాయిలో ప్రజలను తరలించాలని సూచించారు. సమరభేరి సభ ద్వారా బీసీల శక్తిని రాష్ట్రానికి చాటిచెప్పే అవకాశం లభిస్తుందని, ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంగా భావించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు కొత్తకొండ వేణు మరియు కరీంనగర్ టౌన్ ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్
వారి సలహా సూచనలు పార్టీకి వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిగుర్ల మోహన్ , జిల్లా మహిళా కార్యదర్శి ఇస్రాత్ , కరీంనగర్ జిల్లా మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హర్షద్ బిన్ అలీ , మైనారిటీ ప్రధాన కార్యదర్శి అంకుష్ , టౌన్ అధ్యక్షుడు కొత్తకొండ వేణు , టౌన్ ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్ , మహబూబ్ అలీ, కేశపట్నం మండల అధ్యక్షుడు మంజుల లచ్చయ్య తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జులై 5న జరిగే సమరభేరి సభను చారిత్రాత్మక విజయంగా నిలిపేందుకు జిల్లా వ్యాప్తంగా సమన్వయంతో పనిచేయాలని, ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించాలని సమావేశంలో నాయకులు నిర్ణయించారు.
